సాగునీటి రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి తన నివాసంలో వ్యవసాయ, నీటిపారుదల రంగాలపై మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వర రావు మరియు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి సమీక్ష నిర్వహించారు. 1956 నుంచి 2014 వరకు, 2014 నుంచి 2023 వరకు నిర్మించిన ప్రాజెక్టులు, వాటి నిర్మాణ వ్యయాలు, ప్రాజెక్టుల వారీగా సాగులోకి తెచ్చిన ఆయకట్టు వివరాలను అధికారుల ద్వారా సీఎం తెలుసుకున్నారు. ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన మార్గదర్శకాలు ప్రజలకు తెలియజేసేలా చూడాలన్నారు. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని రకాల లెక్కలు పూర్తిగా ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియకుండా దాచిపెట్టే ప్రయత్నం చేయొద్దని, ఒక వేళ అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వంలో ప్రతి నిర్ణయం పారదర్శకంగా ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో ప్రతి అంశాన్ని ప్రజలకు విడమరచి చెబుతున్నామన్నారు. ఈ విషయంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండి నిజాలను ప్రజలకు వివరించాలన్నారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర రావు, నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,శ్రీమతి శాంతి కుమారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి శ్రీ రఘునందన్ రావు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *